23/03/2018
హైదరాబాద్‌కు సర్వీస్ నౌ
-రెండువేల మందికి ఉపాధి
-మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సంస్థ సీఈవో జాన్ డోనామో
-ఐటీ రంగంలో తెలంగాణ విశేష వృద్ధి సాధిస్తున్నదని ప్రశంస
-ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీ విస్తృతికి కృషిచేస్తామని హామీ
ఐటీ రంగంలో తెలంగాణ విశేష వృద్ధి సాధిస్తున్నదని అమెరికాలోని సిలికాన్ కేంద్రంగా ఏర్పాటైన క్లౌడ్ కంప్యూటింగ్, ఐటీ సర్వీస్ మేనేజ్‌మెంట్ సంస్థ సర్వీస్ నౌ సీఈవో జాన్ డోనామో ప్రశంసించారు. ఈ రంగం వృద్ధిలో తాము సైతం భాగం పంచుకుంటామన్నారు. హైదరాబాద్‌లో త్వరలోనే సర్వీస్ నౌ కార్యకలాపాలు ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును ఆ సంస్థ సీఈవో గురువారం అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సంస్థ ఆ బృందంతో మాట్లాడుతూ.. వరుసగా నాలుగో ఏడాది మెర్సర్ సర్వేలో హైదరాబాద్ అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న నగరంగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రపంచంలోని టాప్ కంపెనీలన్నీ హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని చెప్పారు.
సర్వీస్ నౌ సంస్థ.. అమెరికా వెలుపల తన విస్తరణ కేంద్రాన్ని నెలకొల్పేందుకు బెంగళూరు, హైదరాబాద్ నగరాలను తొలుత పరిశీలించింది. ఎక్కడ పెడితే బాగుంటుందన్నదానిపై సర్వేలు చేయించింది. గత ఏడాది రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా వెళ్లినపుడు సర్వీస్‌నౌ సంస్థతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో ఐటీకి ఇస్తున్న ప్రోత్సాహకాల గురించి సంస్థకు వివరించి హైదరాబాద్‌లో కేంద్రం నెలకొల్పాల్సిందిగా కోరగా, వారు ముందుకొచ్చారు. అమెరికా వెలుపల ఆ సంస్థ ఏర్పాటుచేస్తున్న అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లోనే కావడం గమనార్హం.